ఆ వ్యాఖ్యలపై నోరుమెదిపిన రాహుల్‌.. | Sakshi
Sakshi News home page

ఆ వ్యాఖ్యలపై నోరుమెదిపిన రాహుల్‌..

Published Tue, Jul 17 2018 3:15 PM

Congress Chief Rahul Says I Stand With Last Person In The Line  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ముస్లింల పార్టీగా తాను వ్యాఖ్యానించానని సాగుతున్న ప్రచారంపై ఆ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మౌనం వీడారు. క్యూలో చివరి వ్యక్తి వరకూ తాను వెన్నంటి ఉంటానని..వారు అనుసరించే మతం, కులం, విశ్వాసాలను పట్టించుకోకుండా అణగారిన వర్గాలు, ఆదరణకు నోచుకోని వారికి భరోసాగా ఉంటానని రాహుల్‌ స్పష్టం చేశారు. తనకెలాంటి విభేదాలు లేవని, మనుషులందరినీ ప్రేమిస్తానని..తాను కాంగ్రెస్‌ వ్యక్తినంటూ ట్వీట్‌ చేశారు.

మరోవైపు కాంగ్రెస్‌ ముస్లిం పార్టీగా రాహుల్‌ అభివర్ణించారన్న ఓ ఉర్ధూ పత్రిక కథనాన్ని కాంగ్రెస్‌ తోసిపుచ్చింది. ఇవి కేవలం వదంతి మాత్రమేనని, తమ పార్టీ 132 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిథ్యం వహిస్తుందని పేర్కొంది. కాగా, గత వారం ముస్లిం మేథావులతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ ముస్లింల పార్టీగా రాహుల్‌ చెప్పినట్టు ఓ ఉర్థూ పత్రిక ప్రచురించడంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది.

ఆజంఘర్‌లో జరిగిన ఓ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ ముస్లింల పార్టీగా రాహుల్‌ పేర్కొన్నట్టు తాను ఓ పత్రికలో చదివానని చెప్పారు. గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో సహజ వనరులపై ముస్లింలకే తొలి హక్కులున్నాయని వ్యాఖ్యానించారని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాహుల్‌ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి లోనుచేయలేదని చెప్పారు.

Advertisement
Advertisement